27, సెప్టెంబర్ 2012, గురువారం

వినాయక నిమజ్జనంపై పోలీసుల ఆంక్షలు



NewsListandDetails
 వినాయక నిమజ్జనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. తెలంగాణ మార్చ్‌ కంటే ఒకరోజు ముందే నిమజ్జన కార్యక్రమం ఉండడంతో... త్వరగా విగ్రహాలను తరలించాలని పోలీసులు కోరుతున్నారు.  29 అర్థరాత్రిలోపే నిమజ్జనం పూర్తి చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. దీనిపై గణేష్‌ ఉత్సవ కమిటీ మండిపడుతోంది. హడావుడిగా శోభాయాత్రను ఎలా ముగించాలని ప్రశ్నిస్తోంది. అటు తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని జేఏసీని కూడా ఉత్సవ కమిటీ కోరుతోంది.భక్తి, శ్రద్ధలతో సాగే భాగ్యనగర గణేష్‌ శోభాయాత్ర...ఈసారి గుబులు రేపుతోంది. 29న జరగనున్న నిమజ్జనంపై తెలంగాణ మార్చ్ తీవ్ర ప్రభావమే చూపే అవకాశం కనిపిస్తోంది. 30వ తేదీనే తెలంగాణ కవాతు ఉండడంతో... సాధ్యమైనంత త్వరగా నిమజ్జనం పూర్తి చేయాలని పోలీసులు కోరుతున్నారు. గణేష్ మండపాల నుంచి విగ్రహాలను ఉదయం 9 గంటల కల్లా నిమజ్జనానికి తరలించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదేమైనా 29వ తేదీ అర్ధరాత్రి లోపే నిమజ్జనం పూర్తి చేయాలని పోలీసులు పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద పెద్ద క్రేన్లను సిద్ధం చేశారు. అటు భాగ్యనగర గణేష్‌ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన సమావేశానికి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ హాజరయ్యారు. పోలీసుల వేదింపులను మండప నిర్వహాకులు సీపీ కి ఏకరువు  పెట్టారు. హడావుడి చేస్తే... నిమజ్జనం ఎలా పూర్తి చేయాలని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన శర్మ, నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. గణేష్ నిమజ్జనం ఉన్నందున తెలంగాణ మార్చ్ కు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.పోలీసుల హడావుడిపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గుర్రుగా ఉన్నారు. వేధింపుల మధ్య నిమజ్జనం ఎలా కొనసాగించాలని ప్రశ్నిస్తున్నారు. అటు టీ జేఏసీ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనం మర్నాడే తెలంగాణ మార్చ్‌ పెట్టుకోవడంపై మండిపడుతున్నారు. కవాతును వాయిదా వేయాలని కోరుతున్నారు.మొత్తానికి ప్రతి యేటా కన్నుల పండువగా సాగే గణేష్‌ శోభాయాత్ర ఈసారి ఎలా ముగుస్తుందోనన్న టెన్షన్‌ అందరిలోనూ కనిపిస్తోంది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి