27, సెప్టెంబర్ 2012, గురువారం

బీజేపీ నేత విద్యాసాగర్ రావు అరెస్టు



NewsListandDetails
భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును కామారెడ్డి పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలను కలుసుకునేందుకు హైదరాబాద్‌కు వస్తున్న ఆయనను కామారెడ్డిలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ చర్యపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే టి.హరీష్ రావు మండిపడ్డారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయడం దుర్మార్గమని, ఇవి ప్రభుత్వ రెచ్చగొట్టే చర్యలని హరీష్‌రావు విమర్శించారు. వెంటనే విద్యాసాగర్‌ రావును, తెలంగాణ వ్యాప్తంగా అరెస్టు చేసిన జేఏసీ నాయకులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు.. ఈనెల 30వ తేదీన తెలంగాణ మార్చ్‌ను టీజేఏసీ నిర్వహిస్తుండటంతో ముందు జాగ్రత్తగా పలువురు తెలంగాణ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అలాగే, భాగ్యనగరానికి వచ్చే అన్ని రహాదారుపై చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. యువకులను ఎవరిని హైదరాబాద్ రానీయకుండా అడ్డుకుంటున్నారు. స్థానిక జేఏసీ నాయకులకు బైండోవర్ నోటీసులు జారీ చేశారు. నల్లగొండలో 75 మందిని, ఖమ్మంలో 85 మందిని, వరంగల్‌లో 80 మందిని, ఆదిలాబాద్‌లో 65 మందిని, నిజామాబాద్‌లో 90 మందిని, మెదక్‌లో 70 మందిని, కరీంనగర్‌లో 95 మందిని గురువారం అరెస్టు చేశారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి